గీతం యూనివర్సిటీ భూబాగోతం పై ప్రతిపక్షాలు ఆరోపణలకు సరైన సమాధానం

గీతం యూనివర్సిటీ భూబాగోతం పై ప్రతిపక్షాలు ఆరోపణలకు సరైన సమాధానం 

విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ 

గీతం విశ్వవిద్యాలయ భూములపై జగన్ చేసిన ట్వీట్‌కు గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షులు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ గారు ఇచ్చిన స్పందన ఇది‌‌…

ప్రియమైన @ysjagan గారికి,
గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు, మీకు సంబంధించిన మీడియా సంస్థలు గీతం (GITAM) మరియు నాపై అబద్ధాలు, విషపూరిత ప్రచారం చేస్తున్నాయి. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాస్తవాలకు దూరమైన, ఉద్రిక్తతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం.
వైఎస్సార్సీపీ నుంచి సహాయం ఆశించడం లేదు. కానీ 2020లో దసరా సెలవుల సమయంలో, అర్ధరాత్రి, ప్రభుత్వ సెలవు రోజున వైసీపీ ప్రభుత్వం అక్రమంగా మా బౌండరీ వాల్‌ను కూల్చివేసిన తర్వాత అయినా విశ్వవిద్యాలయం విషయంలో ఆలోచన మారుతుందని ఆశించాను.
ఇప్పుడు నేను వాస్తవాలతో స్పందిస్తున్నాను –
ఆరోపణ – 1
ప్రస్తుతం గీతానికి కేటాయించబోయే 54.79 ఎకరాల భూమి విలువ రూ. 5,000 కోట్లు అని చెబుతున్నారు.
స్పందన – A
గీతం రుషికొండ క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో 35 ఎకరాల భూమి మొదట రాజీవ్ స్వగృహ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా, తక్కువ మరియు మధ్యతరగతి ప్రజల కోసం నివాస గృహాల నిర్మాణానికి కేటాయించబడింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, ఆ భూమిని నివాస వినియోగం నుంచి మిక్స్‌డ్ యూజ్‌గా మార్చారు – దాని వెనుక దురుద్దేశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ భూమిని 1000 నుంచి 3000 చదరపు గజాల ప్లాట్లుగా విభజించి వేలం వేశారు.
2022 నుంచి 2024 మధ్యకాలంలో, మే 2024 వరకు కూడా, ఆ ప్లాట్లు కేవలం రిజర్వ్ ధర అయిన చదరపు గజానికి రూ. 60,000 నుంచి 65,000కే అమ్ముడయ్యాయి. సాధారణంగా ఒక ఎకరాలో సుమారు 3000 చదరపు గజాలు ఉంటాయి. అంటే –రూ. 65,000 × 3000 = రూ. 19.5 కోట్లు ఒక్క ఎకరా విలువ
అలా లెక్కిస్తే 54.79 ఎకరాల భూమి మొత్తం విలువ సుమారు రూ. 1,000 కోట్లకు మించి ఉండదు.
గత ఒకటిన్నర సంవత్సరాలుగా గౌరవనీయ ముఖ్యమంత్రి @ncbn గారి నాయకత్వంలో విశాఖలో గణనీయమైన అభివృద్ధి, వృద్ధి జరిగింది అన్నది నేను అంగీకరిస్తాను. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భూమి విలువ ఐదు రెట్లు పెరిగిందని మీరు చెబుతుంటే, అది ఆంధ్రప్రదేశ్‌, విశాఖ అభివృద్ధికి మీరు ఇస్తున్న అతి పెద్ద ప్రశంసే అవుతుంది. దయచేసి మీ వైఖరి ఏంటో మీరే నిర్ణయించుకోండి.
స్పందన – B
2023లో గీతం క్యాంపస్‌కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న భూమిలో సుమారు 11 ఎకరాలను అంతర్జాతీయ పాఠశాల TISB కు మీ ప్రభుత్వమే ఎకరాకు కేవలం రూ. 1 కోట్ల చొప్పున కేటాయించలేదా?
ఒకవేళ నిజంగా భూమి విలువ ఎకరాకు రూ. 100 కోట్లు అయితే, అంత తక్కువ ధరకు ఆ భూమిని ఎందుకు ఇచ్చారు? విశాఖలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి మరెన్నో ఉదాహరణలు ఉన్నాయి. పోలిక కోసం ఒక ఉదాహరణ మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
అయినా కూడా, ఆ నిర్ణయాన్ని నేను స్వాగతించాను. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక మంచి అంతర్జాతీయ పాఠశాల ఏర్పడితే, రాబోయే ఐటీ ఉద్యోగులు మరియు ఇతరుల పిల్లలకు ఉపయోగపడుతుంది. కానీ దురదృష్టవశాత్తూ, మూడేళ్లు గడిచినా ఆ భూమిలో ఇప్పటివరకు ఒక్క నిర్మాణం కూడా మొదలుకాలేదు. దీనిపై వైఎస్సార్సీపీలో ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు?
మీ లెక్కల ప్రకారం చూస్తే, రూ. 1,100 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 11 కోట్లకే అధిక ఫీజులు వసూలు చేసే అంతర్జాతీయ పాఠశాలకు ఎందుకు కేటాయించారు?

ఆరోపణ – 2
వైసీపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసిన భూములను ఇప్పుడు ఉచితంగా ఇచ్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
స్పందన
GVMC ఇచ్చిన NoC భూమి ధర నిర్ణయించే అధికారం కలిగి ఉండదని మీకు తెలుసనే అనుకుంటున్నాను. అది భూమి కేటాయింపు ప్రభుత్వ ఉత్తర్వు కాదు. ఆ ఫైలు CCLAకి, ఆ తర్వాత క్యాబినెట్‌కు వెళ్లిన తరువాతే ఎంత భూమిని, ఏ ధరకు కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటారు.
గత దాదాపు 20 ఏళ్లుగా గీతం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతూనే ఉంది – ప్రభుత్వం నిర్ణయించే ధరను చెల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడూ ఉచితంగా ఏమీ కోరలేదు. ఈ విషయం మీకూ తెలుసు. అయినా ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు.
రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, నాతో సంబంధం ఉన్న ప్రతి సంస్థపై అధిక పరిశీలన ఉంటుందని నాకు తెలుసు. అందుకే నేను ఒక్కటే అభ్యర్థిస్తున్నాను – సహాయం చేయలేకపోయినా పరవాలేదు. కానీ సమాజానికి అనేక విధాలుగా సేవ చేస్తున్న సంస్థలపై దురుద్దేశపూరిత దాడులు చేయవద్దు.
కోవిడ్ సమయంలో, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే మా గీతం హాస్పిటల్ (GIMSR)పై అంత నమ్మకం ఉండటంతో, జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా మమ్మల్ని నియమించింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మేము 3,000కు పైగా రోగులకు చికిత్స అందించాం.
గీతం ఒక “రియల్ ఎస్టేట్ వ్యాపారం” మాత్రమే అయితే, కోవిడ్ మహమ్మారి సమయంలో జిల్లా మొత్తంలో ఉన్న ఇతర ఆసుపత్రులను పక్కనపెట్టి, మా ఆసుపత్రినే ఎందుకు ఎంపిక చేశారు?

—-

 

మేమెవరం?
1980లో స్థాపించబడిన గీతం (GITAM) విశ్వవిద్యాలయం, పూర్తి స్థాయి డిగ్రీ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు దాదాపు లక్ష మంది పూర్వ విద్యార్థులను (అలుమ్నీ) దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దింది. వీరిలో సుమారు 25,000 మంది అమెరికా, యుకే, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం తదితర దేశాలలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారు.
ప్రస్తుతం గీతంలో చదువుతున్న 30,000 మంది విద్యార్థుల్లో సుమారు 10,000 మంది మెరిట్ స్కాలర్‌షిప్‌లు మరియు అవసరాధారిత ఆర్థిక సహాయం పొందుతున్నారు. సంవత్సరానికి రూ.100 కోట్లకు మించిన స్కాలర్‌షిప్‌లు మరియు ఆర్థిక సహాయం అందిస్తూ, ప్రతిభావంతులైన మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండేలా గీతం నిరంతరం కృషి చేస్తోంది.
గీతం విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్ (NIRF) ర్యాంకింగ్స్‌లో ప్రారంభం నుంచే టాప్ 100లో నిలుస్తూ వస్తోంది. అలాగే NAAC A++ గుర్తింపు పొందింది. యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs) ఆధారంగా నిర్వహించే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 30వ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మా విద్యా కార్యక్రమాల్లో 8 ప్రోగ్రామ్‌లు NBA అక్రిడిటేషన్ పొందాయి.
మూడు క్యాంపస్‌లలో కలిపి గీతం విశ్వవిద్యాలయంలో 6,200 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 1,800 మందికి పైగా అధ్యాపకులు కాగా, విశాఖపట్నం క్యాంపస్‌లోనే 4,200 మందికి పైగా సిబ్బంది సేవలందిస్తున్నారు.
సారాంశంగా చెప్పాలంటే, 45 సంవత్సరాల ప్రస్థానంలో భాగంగా, నేడు విశాఖపట్నం క్యాంపస్‌లోనే 18,000 మంది విద్యార్థులు, 850 పడకల బోధనా ఆసుపత్రి ఉన్న నేపథ్యంలో, సమాజ అవసరాలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి క్యాంపస్ విస్తరణకు ప్రభుత్వం నుండి అదనపు భూమి మద్దతు అవసరంగా ఉంది.
విశాఖపట్నంలో ఐటి రంగంలో మాత్రమే భవిష్యత్తులో సుమారు 5 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ఇతర రంగాలతో పాటు ఉన్నతమైన మానవ వనరులు మరియు ఔత్సాహిక వ్యాపారవేత్తలను తయారు చేయడంలో గీతం కీలక పాత్ర పోషించగలదు. అంతేకాకుండా, అనేక ఆధునిక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞాన భాగస్వామిగా (Knowledge Partner) కూడా గీతం సహకరిస్తుంది.
ఇంకా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ, సమయం మరియు స్థలం పరిమితుల దృష్ట్యా, ప్రస్తుతం నా స్పందనను ఇక్కడితో ముగిస్తున్నాను @ysjagan గారు. మీరు చేసిన వ్యాఖ్యలను తిరిగి పరిశీలించి, వాటిని ఉపసంహరించుకుంటారని లేదా సరిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *